2007లో వచ్చిన భూల్ భులయ్య పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా 2022లో భూల్ భులయ్య2 వచ్చింది. ఫస్ట్ పార్ట్‌ని మించి రెండో పార్ట్ పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దీపావళి కానుకగా భూల్ భలయ్య3 రిలీజ్ అయి విజయఢంకా మోగిస్తోంది. అనీస్ బాజ్‌మీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రి ముఖ్యపాత్రలు పోషించారు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజే రూ.70 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి పోటీగా అజయ్ దేవ్‌గణ్‌తోపాటు ఎంతో మంది స్టార్స్ కలిసి నటించిన సింగం ఎగైన్ వచ్చింది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది గెలిచింది అనేది చూద్దాం.
డైరెక్టర్ రోహిత్ శెట్టి గతంలో చేసిన చాలా సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. అయితే 2022లో చేసిన సర్కస్ చిత్రం డిజాస్టర్ కావడంతో దాదాపు 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఇప్పుడు సింగం ఎగైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో స్టార్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు. అజయ్ దేవ్‌గణ్‌తోపాటు అక్షయ్‌కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, అర్జున్ కపూర్ వంటి స్టార్స్ ఈ సినిమాలో ఉన్నారు. కానీ, ఈ స్టార్ కాస్ట్ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకున్నట్టు లేదు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో ఈ ఖర్చు బాగా కనిపిస్తుంది. సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టినా, భారీతారాగణంతో మ్యాజిక్ చెయ్యాలని చూసినా అది భూల్ భులయ్య ముందు పనిచేయలేదు. సింగం ఎగైన్ మొదటి రోజు కలెక్షన్ రూ.44 కోట్లు. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. మరి ఈ రెండు సినిమాల లాంగ్ రన్‌లో ఏది గెలుస్తుందో, ఏది ఓడిపోతుందో కొన్నిరోజుల్లోనే తెలుస్తుంది. అయితే కనిపిస్తున్న కలెక్షన్ ట్రెండ్‌ని చూస్తే భూల్ భులయ్య3కి ఢోకా లేదు అనేది మాత్రం అర్థమవుతుంది.